Pages

Translate

Wednesday, February 5, 2014

రథ సప్తమి





ఇది పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి - అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం.

"సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ సప్తమీ"
ఆకారణం చేత ఈ రోజున సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టినా విశేషఫలం ఉంటుంది. తమకు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

*నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!

*యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!

*ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!

*ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!

సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి.

౧. ఈ జన్మలో చేసిన,
౨. జన్మాంతరాలలో చేసిన,
౩. మనస్సుతో,
౪. మాటతో,
౫. శరీరంతో,
౬. తెలిసీ,
౭. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి,

ఒక్కొక్క దళం చొప్పున
రవి,
భాను,
వివస్వత,
భాస్కర,
సవిత,
అర్క,
సహస్రకిరణ,
సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

ఆవు పేడ పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

***జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి
నమస్తే సూర్యమండలే ***
- అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి.

జిల్లేడు,
రేగు,
దూర్వాలు,
ఆక్షతలు,
చందనాలు కలిపిన నీటితోగాని,
పాలతో గాని, తామ్రపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.




- బ్రహ్మశ్రీ  చాగంటి కోటేశ్వర రావు గారికి ధన్యవాదములతొ... 

Monday, February 3, 2014

అందరికి శ్రీ పంచమి శుభాకాంక్షలు.


ఈ సమస్త విశ్వం శబ్దమయం. నాదం తోనే జగత్ సృష్టి ప్రారంభమయ్యింది. ఆ నాద శక్తికి ప్రతిరూపముగా, సరస్వతి మాత బ్రహ్మవిద్యాస్వరూపిణియై శోభిస్తూ ఉంటుంది. 
విద్యకు అధిష్టాతి సరస్వతి దేవి. ఆ తల్లి మాఘ శుద్ధ పంచమి నాడు అంటే శ్రీ పంచమి నాడు ఆవిర్భవించింది అని శాస్త్రవాక్కు.

శ్రీ పంచమి నాడు సరస్వతి దేవిని పుస్తకాలు లేక విగ్రహరూపములో ఆవహన చేసి పూజిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయని, ఙ్ఞాపకశక్తి ,మేధ, బుద్ధి, వృద్ధి చెందుతాయని చెప్పబడింది.
అందుకే ఈ రోజున ఙ్ఞానాభివృద్ధి కోసం దేవతలు సైతం సరస్వతి దేవిని పూజిస్తారు.

సర్వజీవులలో చైతన్యస్వరూపిణిగా ప్రవహించే శక్తి స్వరూపిణియే "సరస్వతి".

శ్రీ మాత అని కీర్తించబడిన ఆ తల్లి విశ్వేస్వరుని వాక్, బుద్ధి, ఙ్ఞానాదిధీశక్తులకు అధిష్టాత్రి.

సృష్టిలోని సమస్త జీవులకు ఆ తల్లి వల్లనే ఉలుకు,పలుకు,ఎరుక ఏర్పడుతాయి.

మాఘస్య శుక్ల పంచమ్యాం
మానవో మనవోదేవా మునీంద్రాశ్చ ముముక్షవః
వసవో యోగినస్సిద్ధా నాగా గంధర్వ రాక్షసాః
మద్వరేణ కరిష్యంతి కల్పేకల్పే లయావధి
భక్తియుక్తస్చ దత్త్వావై చోపచారాణి షోడశ

మాఘశుద్ధ పంచమి నాడు ఈ విశ్వం అంతా మానవులు, మనువులు,దేవతలు మునులు, ముముక్షువులు,వసువులు,యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు,రాక్షసులు.....అందరు సరస్వతి దేవిని ఆరాధిస్తారు అని దేవి భాగవతం చెప్తోంది.

మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి సరస్వతి దేవి. అందుకే సూర్యుడు ఆ తల్లి ని ఇలా ప్రార్ధించాడు.

సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. 

Wednesday, November 7, 2012

వైకుంఠం ఎంత దూరంలో వుంది?

ఒక గురుకులంలో గురువు శిష్యులకు గజేంద్రమోక్షం కథ గురించి చెబుతున్నాడు. ''మొసలిబారినపడిన గజేంద్రుడు గొంతెత్తి విష్ణుమూర్తిని పిలిచాడు తనను రక్షించమని. సతీమణి లక్ష్మీదేవికి చెప్పకుండా, శంఖచక్రాలు ధరించకుండా, తన వాహనమైన గరుత్మంతుడిని అధిరోహించకుండానే విష్ణుమూర్తి వెంటనే బయలుదేరాడు'' అంటూ గురువు కథ చెప్పడం పూర్తిచెయ్యకుండానే ఒక శిష్యుడు సందేహం వెలిబుచ్చాడు. ''అయ్యా! గజేంద్రుడు అరిచిన తక్షణమే విష్ణుమూర్తి బయలుదేరాడు, అంటే వైకుంఠం ఎంత దూరంలో ఉంది?'' ఈ ప్రశ్నకు గురువు తెల్లముఖం వేశాడు. అదే ప్రశ్న ఇతర శిష్యులకు సంధించాడు- తన అజ్ఞానం బయటపడకుండా. శిష్యులెవరూ సమాధానం చెప్పలేదు.
ప్రశ్న వేసినవాడే ''అయ్యా, గజేంద్రుడు గొంతెత్తి పిలిస్తే ఆ పిలుపు ఎంతదూరం వినబడుతుందో అంతే దూరంలో వైకుంఠం ఉంది'' అన్నాడు.
గురువుకు జ్ఞానోదయమైంది. శిష్యుడు తెలిసీ తెలియకుండా చెప్పిన జవాబులోని పరమపదం గురించిన పరమార్థం అవగతమైంది. వెంటనే శిష్యులకు చెప్పాడు- ''భగవంతుడు సర్వాంతర్యామి, భక్తుడు ఆర్తితో భక్తితో పిలిస్తే వెంటనే పలుకుతాడు'' అన్నాడు. పరమపదసోపానం అధిరోహణలో భగవంతుడు, భక్తుడి వెంటే ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆ చేయి వదలకుండా భగవంతుడి వెంట నడవటమే భక్తుడి విధి.

Friday, November 2, 2012

మీ కలల్ని నిజం చేసుకోండి!


మనలో చాలమంది అనుకుంటూ వుంటాం...''అలా వుంటే బాగుండేది...అప్పుడలా వుండి వుంటే...ఇలా జరిగేది...అది చేసేవాళ్ళం...ఇది చేసివుండివాళ్ళం....అలా ఇలా...అంటూ...''

గతాన్ని మర్చిపోండి, మీ వయసును మర్చిపోండి...ఇంకా మిగిలివున్న మీ జీవితంలో ఇదే మొదటిరోజు అనుకోండి....మీ కలలను నిజం చేసుకోవటానికి ఇదే సరైన సమయం...ఈరోజే...ఇప్పుడే ప్రారంభించండి....

1. మీరు మీలానే వుండండి : మీ కలలను నిజం చేసుకోవాలంటే...ముందు మీ అంతరాత్మకు మీరు నిజాయితీగా వుండండి. మీరు చేసేది సరైనదే అని మీకు చాలా బలమైన నమ్మకం వున్నప్పుడు ఇతరుల మాటలను, విమర్శలను పట్టించుకోకండి. మీ వైఫల్యాలనుంచి మరింత నేర్చుకోండి... పైకెదగండి.. ముఖ్యంగా మానసికంగా...మానసికమైన స్థైర్యం, లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు.

2. సమయాన్ని కేటాయించండి : రోజులో కొంత సమయాన్ని తప్పనిసరిగా మీ లక్ష్యాన్ని చేరటానికి కేటాయించండి. నిజంగా మీకేం కావాలో, ఏం సాధించాలనుకుంటున్నారో నిరంతరం పరిశీలించుకుంటూ వుండండి. ప్రతిరోజూ హాయిగా నవ్వుకోవటానికి, ఇతరులను ప్రేమించటానికి, (మీ విమర్శకులను) క్షమించటానికి, కష్టాలలో వున్నవారిని ఓదార్చటానికి కొంత సమయం కేటాయించండి. అందరి కష్టాలను మీరు తీర్చలేకపోవచ్చు...కానీ ఒక్క ఓదార్పుమాట, ధైర్యాన్నిచ్చే చేతిస్పర్శ...బాధపడేవారికి చాలా స్వాంతననిస్తుంది...ధైర్యాన్నిస్తుంది.

3. మీరే మార్గనిర్దేశకులు : మీ యీ ప్రయాణంలో మీకు మీరే మార్గనిర్దేశకులు. చాలామంది సామర్థ్యం వున్నా తమ లక్ష్యాలను, గమ్యాలను చేరలేకపోవటానికి ఒక కారణం...అనవసర భయాలు...ఇతరులకు తమపై వున్న అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వటం...గమ్యానికి చేరుకోవటానికి ఇవన్నీ పెద్ద ఆటంకాలే. మీరేమిటో...మీ లక్ష్యాన్ని చేరటంద్వారా నిరూపించుకోండి...మీ నమ్మకాన్ని మరింత దృఢతరం చేసుకోండి. అవసరమైతే పోరాడండి మీ ఏకాగ్రత అంతా మిమ్మల్ని ముందుకు నడిపించే విషయాలపైనే వుండాలి. చివరకు మిమ్మల్ని విమర్శించినవాళ్ళే మీ విజయాన్ని ఒప్పుకోకతప్పదు. మీ జీవితపు పగ్గాలను ఇతరులకు అప్పగించకండి...మీరు విజయం సాధించాలన్నా, పరాజయం పొందాలన్నా మీ చేతుల్లోనే వుంది.

4. చాలా విలువైంది...వృధా చేయకండి : సమయం చాలా విలువైందని మీకందరికీ బాగా తెలుసు...నేను ఇప్పటికీ కొంతమందిని చూస్తుంటాను...అనవసరమైన వాగ్వివాదాలతో, మాటలతో, విమర్శలతో... సమయం చాలా వృధా చేస్తూండటం... మీకు నిజంగా ఖాళీ సమయం దొరికితే.... మంచి పుస్తకాలు చదవండి...అవి మీ జ్ఞానాన్ని పెంచుతాయి. వీలైతే ఇతరులకు సాయం చేయండి. ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి/తెలుసుకోవటానికి ప్రయత్నించండి.

5. మీ ఆలోచనలు మార్చుకోండి : ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. దేన్నైనా సృష్టించగలవు...నాశనం చెయ్యగలవు కూడా. వ్యతిరేకధోరణి సాధ్యమైనంతవరకు తగ్గించుకోండి. సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోండి. మీ చుట్టూ చాలా అవకాశాలున్నాయి...పరిశీలించండి.. మీకు తగినవాటిని అందిపుచ్చుకోండి. అవకాశాలు మళ్లీ మళ్లీ రావు..

6. మీరు సాధించగలరు : మీ లక్ష్యం చాలా పెద్దదైనప్పుడు...మీ ప్లాన్లు సాధించటానికి కష్టతరంగా వున్నప్పుడు...ఒక్క అడుగు ముందుకేయండి మీ గమ్యం దిశగా...''వెయ్యిమైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంద''నే విషయం మర్చిపోకండి... ప్రారంభించకుండా మాత్రం లక్ష్యం గురించి కలలు కనొద్దు.

7. ప్రతికూల వాతావరణాన్ని మార్చటానికి ప్రయత్నించండి : మీమీద మీకు నమ్మకం వున్నప్పుడే ఏదైనా సాధించగలరు...మీ చుట్టూ వున్న ప్రతికూలవాతావరణంలో మీ లక్ష్యసాధనకు వుపయోగపడే అనుకూల అంశమేదైనా వుందేమో పరిశీలించి చూడండి. తప్పకుండా కనీసం ఒక్కటైనా కనబడుతుంది. దాన్ని వెతికి పట్టుకుని మీ గమ్యం చేరటానికి ఇంధనంలా వుపయోగించుకోండి.

8. ఆనందకరమైన క్షణాల్ని వదులుకోవద్దు : లక్ష్యసాధనలో ఎంత బిజీగా వున్నా...మిమ్మల్ని సంతోషపరచే నేస్తాన్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని, పుస్తకాలను...నిరంతరం మీ శ్రేయస్సు కోరేవాళ్ళని...మీరు మర్చిపోవద్దు...దూరం కావద్దు...ఎంతగా పనిచేస్తారో....అంతగా రిలాక్స్‌ అవడం కూడా నేర్చుకోవాలి.

9. నిజాయితీగా ప్రేమించండి : మీరు నిజంగా ఎవర్నైతే యిష్టపడుతున్నారో...వారితో నిజంగా ప్రేమగా వుండండి...ప్రేమగా మాట్లాడండి...ఎవరి సాంగత్యంలో మీరు హాయిగా, సంతోషంగా వుండగలరో.... వారితో ఎక్కువ సమయం గడపండి...మీ ఆనందం రెట్టింపవుతుంది... వ్యక్తిగతంగా కలవకపోయినా...ఉత్తరాలద్వారానో, ఫోన్లద్వారానో, ఈ-మెయిల్స్‌ ద్వారానో మీ ప్రేమను వ్యక్తం చేయండి..

10. ఆఖరుది...కానీ చాలా ముఖ్యమైనది : మిమ్మల్ని విమర్శించేవారి గురించిగాని... మీరంటే ఇష్టంలేనివారి గురించి ఆలోచించి బాధపడకండి.. వేదన పడకండి... మీరంటే ఇష్టంలేనివాళ్ళు కొంతమంది వున్నా.... ఇష్టపడేవాళ్ళు చాలామంది వుంటారు... మీకోసం...మీ ప్రేమకోసం ఎదురుచూసేవాళ్ళు చాలామంది వుండేవుంటారు... వారి దగ్గరికెళ్ళండి... మీ ప్రేమను పంచండి... అవసరమైతే సాయం చేయండి...అప్పుడు చూడండి... మీరెంత సంతోషాన్ని పొందుతారో... నిజమైన సంతోషం ఎక్కడ వుందో తెలుసుకోవటానికి ప్రయత్నించండి..

లాస్ట్‌ బట్‌ నాట్‌ ది లీస్ట్‌....విమర్శలనుంచే పైకెదగటానికి ప్రయత్నించండి...ఆటంకాలు ఎదురైనప్పుడల్లా మరొక్క అడుగు ముందుకు వేయటానికి ప్రయత్నించండి.

ఈ చిన్న కథ మీతో పంచుకోవాలని వుంది :
కాలేజి చదువుకూడా పూర్తికాకుండానే చదువు మానేసిన 38 ఏళ్ళ ఒక లైబ్రేరియన్‌ రాసిన లేఖ :
''నాకు చిన్నప్పటినుంచీ మా తాతగారిలా సైకాలజిస్ట్‌ కావాలని జీవితకాలపు కోరిక. నా ప్రస్తుత వుద్యోగం నాకు బాగానే వున్నా...మనసులో వున్న యీ తీవ్రమైన కోరికవల్లనో...దేనివల్లనో గానీ మెల్లగా నన్ను సలహాలడిగే వారి మానసిక సమస్యలకు నేను సలహాలనిస్తూ వారి సమస్యా పరిష్కారాలకు మార్గదర్శినయ్యాను...చాలామంది ఇప్పటికీ నన్నొక మానసికవైద్యునిగా భావిస్తూ కౌన్సిలింగ్‌కు వస్తూంటారు.
కానీ నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళి, డిగ్రీ పూర్తిచేసి, సైకాలజీలో డాక్టరేట్‌ చేసి, ప్రాక్టీస్‌ ప్రారంభించాలంటే...కనీసం 8 ఏళ్ళు అవుతుంది. అప్పటికి నా వయసు 46 ఏళ్ళు అవుతుంది...ఏం చెయ్యాలో తెలియటం లేదు...'' అంటూ...

కొన్ని ప్రశ్నలలోనే జవాబు వుంటుంది.
అతను పొందిన జవాబు :

''మీరిది (సైకాలజీ డాక్టరేట్‌) చెయ్యకపోతే...ఈరోజు నుంచి 8 ఏళ్ళ తరువాత మీ వయసు ఎంత?''

ఉదాత్త భావనలు


నువ్వు మాట్లాడినప్పుడు నిజం మాట్లాడు. నువ్వు ఏది వాగ్ధానం చేశావో దాన్ని నెరవేర్చు. నీమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు. నీ చేతుల్ని హింసకు దూరంగా ఉంచు. అన్యాయమైన దాన్నీ, అక్రమమైనదాన్నీ అందుకోకుండా చాచిన చేతుల్ని వెనక్కి తీసుకో.

'ఏ పనులు గొప్ప పనులు?

ఒక మనిషి హృదయాన్ని సంతోషపెట్టడం, ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడం, దెబ్బతిన్నవాళ్ళకి సాయం చేయడం, దుఃఖార్తుల దుఃఖాన్ని తేలికపరచడం, గాయపడ్డవారి గాయాలకు మందు పూయడం'.

'భగవత్‌సృష్టి మొత్తం భగవంతుని కుటుంబమే. ఎవరు భగవంతుడు సృష్టించిన వాటికి హితం కోరుతారో, చేకూరుస్తారో అతడే భగవంతుడికి అందరికన్నా ఎక్కువ ప్రీతిపాత్రుడు.'

Thursday, October 25, 2012

నిత్య సహచరి


పుస్తకాలు మన నిత్య సహచరులు, ఒక మంచి పుస్తకం చదవడం, దాన్ని భద్రంగా దాచుకోవడం మన జీవితానికి ఒక శాశ్వత ఆవరణ సమకూర్చుకోవటం లాంటిది. మంచి పుస్తకం మనకొక నిత్య సహచరి. కొన్ని పుస్తకాలు మనకన్నా ముందు పుట్టి మన జీవితంలో మనకు దారిచూపుతూ, మన తదనంతరం కూడా అలా మార్గనిర్దేశం చేస్తూనే వుంటాయి.

అన్ని రకాలు పుస్తకాలు చదవటం నాకిష్టమే....మరీ ఇష్టమైన పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదువుతూ వుంటాను. ప్రతీసారీ ఏదో ఒక్క కొత్త విషయాన్ని నేర్చుకుంటూ, సంతోషపడుతూంటాను. ఇటీవలే చదివిన ''ఎవరికీ తలవంచకు'' (Indomitable Spirit by A.P.J. Abdul Kalam - తెలుగు అనువాదం : వాడ్రేవు చినవీరభద్రుడు)...అద్భుతమైన పుస్తకం....మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేంత గొప్ప పుస్తకం....అన్నిటికన్నా మించి...ప్రతి ఒక్క విషయమూ ఆలోచింపచేస్తూ....మనసును కొన్ని విషయాల్లో ప్రక్షాళన చేస్తోంది...మీకు అందుబాటులో వుంటే తప్పకుండా ఒకసారి చదవండి. మార్పు మీకే తెలుస్తుంది!

మంచి పుస్తకాలు నా ఆప్తమిత్రులు
నేను క్రుంగిపోయినప్పుడు నాకు ధైర్యాన్ని నూరిపోస్తాయి
ప్రేమతో మనసుకు స్వాంతన  కలిగిస్తాయి...
అందుకే నా దగ్గరి వాళ్ళకు చెబుతుంటాను....పుస్తకాలతో స్నేహం చేయమని అవి మంచి మిత్రులవుతాయని''

(మీరిప్పుడు చదివినదంతా ఆ పుస్తకం సూర్తితో రాసిందే!)

Monday, October 22, 2012

మేల్కొన్న మహిళ



ఆమె సమున్నత శిరస్కురాలై

అభీతనేత్రాలతో

నిర్భయంగా సంచరిస్తుంది

ఆమెకు నిర్దిష్ట విశ్వాసాలుంటాయి

విశాల ఆదర్శాలుంటాయి

జ్ఞానం వల్ల సిద్ధించిన కించిత్‌ గర్వం కూడా వుంటుంది

సుశిక్షితురాలైన అటువంటి విదుషీమణి

తానెంచుకున్న మార్గాన్ని తప్పదెన్నటికీ

ఆమె అజ్ఞానాన్ని పారద్రోలుతుంది

సుజ్ఞాన మనస్కయై జీవితానందాన్ని స్వాగతిస్తుంది


మేల్కొన్న మహిళల ప్రవర్తన ఇలా వుంటుంది

మనదేశపు స్త్రీలందరికీ మహాకవి కన్న స్వప్నం నిజమయ్యే రోజు తప్పక వస్తుందనీ, త్వరలో రావాలని ఆకాంక్షిస్తూ...