ఈ సమస్త విశ్వం శబ్దమయం. నాదం తోనే జగత్ సృష్టి ప్రారంభమయ్యింది. ఆ నాద శక్తికి ప్రతిరూపముగా, సరస్వతి మాత బ్రహ్మవిద్యాస్వరూపిణియై శోభిస్తూ ఉంటుంది.
విద్యకు అధిష్టాతి సరస్వతి దేవి. ఆ తల్లి మాఘ శుద్ధ పంచమి నాడు అంటే శ్రీ పంచమి నాడు ఆవిర్భవించింది అని శాస్త్రవాక్కు.
శ్రీ పంచమి నాడు సరస్వతి దేవిని పుస్తకాలు లేక విగ్రహరూపములో ఆవహన చేసి పూజిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయని, ఙ్ఞాపకశక్తి ,మేధ, బుద్ధి, వృద్ధి చెందుతాయని చెప్పబడింది.
అందుకే ఈ రోజున ఙ్ఞానాభివృద్ధి కోసం దేవతలు సైతం సరస్వతి దేవిని పూజిస్తారు.
సర్వజీవులలో చైతన్యస్వరూపిణిగా ప్రవహించే శక్తి స్వరూపిణియే "సరస్వతి".
శ్రీ మాత అని కీర్తించబడిన ఆ తల్లి విశ్వేస్వరుని వాక్, బుద్ధి, ఙ్ఞానాదిధీశక్తులకు అధిష్టాత్రి.
సృష్టిలోని సమస్త జీవులకు ఆ తల్లి వల్లనే ఉలుకు,పలుకు,ఎరుక ఏర్పడుతాయి.
మాఘస్య శుక్ల పంచమ్యాం
మానవో మనవోదేవా మునీంద్రాశ్చ ముముక్షవః
వసవో యోగినస్సిద్ధా నాగా గంధర్వ రాక్షసాః
మద్వరేణ కరిష్యంతి కల్పేకల్పే లయావధి
భక్తియుక్తస్చ దత్త్వావై చోపచారాణి షోడశ
మాఘశుద్ధ పంచమి నాడు ఈ విశ్వం అంతా మానవులు, మనువులు,దేవతలు మునులు, ముముక్షువులు,వసువులు,యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు,రాక్షసులు.....అందరు సరస్వతి దేవిని ఆరాధిస్తారు అని దేవి భాగవతం చెప్తోంది.
మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి సరస్వతి దేవి. అందుకే సూర్యుడు ఆ తల్లి ని ఇలా ప్రార్ధించాడు.
సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్.
No comments:
Post a Comment